గజ్వేల్ ఏప్రిల్ 04 (మన వార్త ప్రతినిధి )
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో శనివారం రోజు ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుడిసె లక్ష్మణ్ (29) అనే కౌలు రైతు ఆర్థిక ఇబ్బందులు, పంట నష్టం తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు లక్ష్మణ్ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. వ్యవసాయమే జీవనాధారంగా నమ్ముకున్న ఆయన, అప్పులు చేసి కౌలుకు భూమి తీసుకుని సాగు చేశారు. అయితే, ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడం, పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో దిక్కుతోచని స్థితిలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. లక్ష్మణ్ మరణంతో ఆయన భార్య కళ్యాణి మరియు ఇద్దరు కుమార్తెలు వనజ (5), సన్విక (3) దిక్కులేని వారయ్యారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న గజ్వేల్ పోలీసులు వెంటనే జాలిగామ గ్రామానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, లక్ష్మణ్ మృతికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియాల్సి ఉంది.