ఇల్లంతకుంట,మే 16 (మన వార్త ప్రతినిధి):
ఇల్లంతకుంట మండలంలోని అనంతారం వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద లారీలు అందుబాటులో లేకపోవడంతో రైతులు శనివారం ఉదయం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.కొనుగోలు చేసిన వడ్లను తరలించేందుకు లారీలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల ఆందోళనతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న స్థానిక ఎస్సైలు సిరిసిల్ల అశోక్,జి.లక్పతి ఘటనాస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు.అనంతరం ఎస్సై సిరిసిల్ల అశోక్ తహసీల్దార్ రాచకట్ల సురేష్‌తో ఫోన్‌లో మాట్లాడి సమస్యను వివరించారు.అలాగే ఐకేపీ ఇన్‌చార్జ్ సీతారాం రెడ్డితో చర్చించగా నేటి రోజునే లారీలు వస్తాయని తెలిపారు.దీంతో రైతులకు విషయం వివరించగా వారు ధర్నాను విరమించారు.అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను యథావిధిగా పునరుద్ధరించారు.