,ఏప్రిల్ 21 (మన వార్త ప్రతినిధి);ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి అనంతారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.ఇప్పటికే పలుమార్లు సమస్య వెలుగులోకి వచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.మండల కేంద్రం కావడంతో నిత్యం వందలాది వాహనాలు,పరిసర గ్రామాల ప్రజలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు.ఇలాంటి ప్రధాన రహదారి చెత్తాచెదారాలు,మాంస వ్యర్థాలతో నిండిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.మండల అధికారుల నిర్లక్ష్యం కారణంగా చికెన్,మటన్ సెంటర్ల నిర్వాహకులు మాంస వ్యర్థాలు,చెత్తాచెదారాలను రహదారి పక్కన వేస్తున్న ఘటనలు కొనసాగుతున్నాయి.ఈ మాంస వ్యర్థాలను రోడ్డు పక్కన పడేయడం వల్ల దుర్వాసన వ్యాపించి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రోడ్డు పక్కన పడేసిన మాంస వ్యర్థాలను కుక్కలు,పందులు తినడంతో అవి రహదారిపై తిరుగుతూ వాహనదారులకు అడ్డంకిగా మారుతున్నాయి.దీంతో ఇప్పటికే పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు చెబుతున్నారు.ప్రధాన రహదారిపై ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.“అధికారులు స్పందించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది.ఇంకా ఎన్ని ప్రమాదాలు జరిగితే చర్యలు తీసుకుంటారు?” అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి చికెన్,మటన్ సెంటర్లకు నోటీసులు జారీ చేసి, చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.