ఇల్లంతకుంట,ఏప్రిల్ 02 (మన వార్త ప్రతినిధి);ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి అనంతారం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి చెత్త కుప్పగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.సుమారు 20 రోజుల క్రితం అనంతారం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై “మనవార్త”లో ప్రచురితమైనప్పటికీ ఇప్పటివరకు అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తోంది.బుధవారం రాత్రి సమయంలో మరోసారి రహదారిపై చెత్తాచెదారాలు పారేసి వాటిని కాల్చివేయడం జరిగినట్లు స్థానికులు తెలిపారు.సమాచారం మేరకు ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించగా రహదారిపై చెత్తాచెదారాలతో పాటు మాంస వ్యర్థాలు వేసి కాల్చిన ఆనవాళ్లు కనిపించాయి.ఈ మాంస వ్యర్థాలు,చెత్తాచెదారాలు కుక్కలు,పందులు తినడంతో అవి రహదారిపై తిరుగుతూ వాహనదారులకు అడ్డంకిగా మారుతున్నాయి.దీంతో ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.అతి దారుణంగా మారిన ఈ రహదారిపై దుర్వాసనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.“ఈ సమస్యకు పరిష్కారం చూపే నాధుడు ఎవరు?” అని వాహనదారులు,ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..“ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే దాకా చూస్తారా?” అని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..ప్రధాన రహదారిపై ఇలాంటి పరిస్థితులు నెలకొన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు..ఇప్పటికైనా స్పందించి రహదారిని శుభ్రపరచడంతో పాటు చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.