.ఇల్లంతకుంట, ఆగస్టు 8 (మన వార్త ప్రతినిధి):సోషల్ మీడియా,వాట్సాప్ గ్రూపుల్లో అసభ్యకరమైన,అవమానపూర్వక పోస్టులు చేసిన ఇద్దరు వ్యక్తులపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం,6-8-2025 బుధవారం రోజున ముస్కానిపేట గ్రామానికి చెందిన సామనపల్లి శంకర్ (కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు) తనపై “మన ఊరు మన మండలం” అనే వాట్సాప్ గ్రూపులో ఇల్లంతకుంట గ్రామానికి చెందిన మహమ్మద్ సాదుల్ అనే వ్యక్తి అవమానకరమైన మెసేజ్‌లు పంపినట్లు ఫిర్యాదు చేశారు.అదే రోజు నర్సక్కపేట గ్రామానికి చెందిన కొత్త రాజు అనే వ్యక్తి మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణపై మార్ఫింగ్ వీడియోలు,ఫోటోలు అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఇతరుల మనోభావాలు దెబ్బ తినే విధంగా చేశారని ఇల్లంతకుంట మండలం ముస్కాన్ పేట గ్రామానికి చెందిన సామనపల్లి శంకర్ శుక్రవారం రోజున దరఖాస్తు ఇవ్వగా వారి ఇద్దరిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూప్ లలో ఎవరైనా వ్యక్తులు,పార్టీలను,కులాలను,ప్రాంతాలను అవమానించే విధంగా పోస్టులు లేదా ఫార్వర్డ్ చేస్తే చట్టం ప్రకారంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.