స్వర్ణగిరి శ్రీనివాసునికి తిరుప్పావడ సేవ….

*నయనానందకరంగా స్వర్ణగీరీశున్ని నిత్య కళ్యాణ మహోత్సవం.*
*ఆలయ తీరు వీధుల్లో వెంకన్న స్వామికి తీరు వీధి ఉత్సవ సేవ.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మే / 08 / మన వార్త జిల్లా ప్రతినిధి* కలియుగ ప్రత్యక్ష దైవమైన యాదాద్రి తిరుమల స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో నేటి ఉదయం సుప్రభాత సేవతో మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు పలు కార్యక్రమాలను చేపట్టినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు ఆలయ ప్రధాన అర్చకులు శ్రవణాచార్యులు , ఆలయ చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణలు తెలిపారు. గురువారం సందర్భంగా సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండడం కోసం స్వామి వారికి జరిపే అన్న కూటోత్సవాన్నే తిరుప్పావడ సేవ అంటారు. ప్రతి గురువారం నైవేద్య సమయంలో తిరుప్పావడ సేవ జరుగుతుంది. స్వర్ణగీరీశునికి సుమారు 450 కిలోల అన్న ప్రసాదం అనగా లడ్డు , వడ , తదితర పిండివంటలను శ్రీవారికి నైవేద్యం చేస్తారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో స్వామివారికి అర్చించి కర్పూర మంగళహారతులను సమర్పిస్తారు. ఉదయం 10:30 లకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచిత స్వర్ణాభరణాలతో , పరిమళ భరిత పుష్ప మాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు దిట్టకవి శ్రవణాచార్యులు దివ్యకరములచే అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులు శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా నేడు సుమారు 3000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం 6:30 లకు ఆదిమధ్యాంతరహితుడైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయ మానంగా ఊరేగిస్తూ భక్తులు తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారు దేదిప్యమానంగా వెలుగుతున్న సహస్రదీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయఅర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో శ్రీ స్వామి వారిని ఆర్చించి కర్పూర మంగళహారతులను సమర్పించగా శ్రీవారిని భక్తులు నయనానంద కరంగా దర్శించుకున్నారు. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నట్లు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణలు తెలిపారు.

Leave a Comment