గజ్వేల్ జూలై 15 (మన వార్త ప్రతినిధి జీ మురళి)స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలని, ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర మంత్రి పూర్ణం ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం జరిగిన గజ్వేల్ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన పేదలందరికీ ప్రజా సంక్షేమ పథకాలను వర్తింప చేస్తుండగా, ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేసినట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉంటూ పార్టీ పట్టిష్టతకు కృషి చేయాలని, అంతేకాకుండా గ్రూపులు, వర్గాలు పక్కనపెట్టి పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గజ్వేల్ నియోజక వర్గానికి 3 వేల ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే అర్హులైన 2938 మంది లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. అవసరమైన పక్షంలో మరిన్ని మంజూరీ చేస్తామని, అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ప్రజాపాలనతో ప్రభుత్వ పథకాలను పేదల చెంతకు చేర్చుతుండగా, ఆనందం వ్యక్తమవుతున్నట్లు చెప్పారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు భరోసా కింద రూ 9 వేల కోట్లు రైతుల ఖాతాలలో జమ చేయగా, ఏకకాలంలో రూ 2 లక్షల పంట రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. పేదల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ 10 లక్షలకు పెంచగా, సీఎం రిలీఫ్ ఫండ్ కింద జిల్లాకు రూ 900 కోట్లను అందజేసినట్లు స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తుండగా, సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయమని అన్నారు. గ్రామీణ పేదల ఆర్థిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో లక్షా 86 వేల గృహాలకు 200 ల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు గుర్తు చేశారు. లక్షా 79 వేల గృహాలకు రూ 500 లకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తుండగా, మంచి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు తూoకుంట నర్సారెడ్డి, నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బాగనోళ్ళ విజయ మోహన్, వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్, పరశురాం, ప్రభాకర్ గుప్త, ఆయా మండలాల బాధ్యులు రవీందర్ రెడ్డి, సందీప్ రెడ్డి, కనకయ్య, లింగారావు, సుఖేందర్ రెడ్డి, మొనగరి రాజు, ప్రణవి రెడ్డి, సారిక రెడ్డి, జ్యోతి కృష్ణ, అంజి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.