సికింద్రాబాద్ జూన్ 26 మన వార్త ప్రతినిధి అంతోని :తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో అవినీతిని అరికట్టేందుకు బుధవారం ఉదయం ఏసీబీ (ఆంటీ-కరప్షన్ బ్యూరో) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుంచే పలు బృందాలుగా విడిపోయిన ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి దూసుకెళ్లి, ఏజెంట్ల కార్యకలాపాలను పసిగట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు.ఈ దాడుల్లో మొత్తం 20 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారి వద్ద నుంచి నగదు, వాహన ధ్రువీకరణ పత్రాలు, మొబైల్ ఫోన్లు, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు.వాహన రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, ట్రాన్స్ఫర్ వంటి సేవల పేరుతో అక్రమ రీతిలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారం ఆధారంగా ఈ దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడులతో ఆర్టీఏ కార్యాలయం పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.తదుపరి విచారణ కొనసాగుతోంది. అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ స్పష్టం చేసింది.