దొంగల దృష్టి ఆలయాలపై…కాపలా బాట పట్టిన గ్రామస్తులు…పెద్దమ్మ గుడి రక్షణకు వల్లంపట్లలో రాత్రి పహారా….

.ఇల్లంతకుంట,ఫిబ్రవరి 03 (మన వార్త ప్రతినిధి);రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిధిలోని పలు గ్రామాల్లో దేవాలయాల్లో వరుస దొంగతనాలు చోటుచేసుకుంటుండటంతో ఆలయాల భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది.ఇటీవలి కాలంలో పల్లె ప్రాంతాల్లోని దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు పూజా సామగ్రి, పుస్తె మట్టెలు,బంగారు ఆభరణాలు వంటి విలువైన వస్తువులను అపహరిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి.ఈ పరిణామాలు గ్రామ ప్రజల్లో భయాందోళనలకు దారితీస్తున్నాయి.ఈ పరిస్థితుల దృష్ట్యా పోలీసు శాఖ సూచనల మేరకు వల్లంపట్ల గ్రామస్తులు అప్రమత్తమయ్యారు.మంగళవారం గ్రామంలోని పెద్దమ్మ గుడి వద్ద ముందస్తు జాగ్రత్త చర్యగా ముదిరాజ్ కులస్తులు స్వచ్ఛందంగా రాత్రి కాపలా ఏర్పాటు చేశారు.గుడి పరిసరాల్లో పహారా కాస్తూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనిస్తూ దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.ఆలయ రక్షణ కోసం ముదిరాజ్ కులస్తులు ఏకమై ముందుకు రావడం ప్రశంసనీయమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Comment