కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. రూ. కోటిపైగా ఆస్తినష్టం…

మల్యాల, నవంబర్ 30 (మన వార్త ప్రతినిధి)జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారిలోని కొండగట్టు దిగువన ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రాంతంలో శనివారంరాత్రి షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి సుమారు 30కి పైగా బొమ్మల దుకాణాలు దగ్ధమయ్యాయి. కాగా, మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో దుకాణాల నుంచి జనాలు బయటకు పరుగులు పెట్టారు. దీంతో బొమ్మలు అమ్ముకుని జీవనం సాగించే కొన్ని కుటుంబాలకు కట్టుబట్టలే మిగిలాయి. దుకాణ సామాగ్రితోపాటు, నగదు, ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి. కాగా, అగ్నిప్రమాద దృశ్యాలు సంఘటనా జరిగిన తీవ్రతను తెలియజేస్తున్నాయి. సుమారు కోటికి పైగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం సంభవించగా, దుకాణాలు వెదురు బొంగులతో తయారుచేయడంతో పాటు, అందులో పూర్తిగా ప్లాస్టిక్కు చెందిన వస్తువులు ఉండడంతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. అలాగే, ఫైర్ ఇంజన్ సకాలంలో స్పందించకపోవడం వల్లనే భారీ ప్రమాదం చోటు చేసుకుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజన్ త్వరగా వచ్చి మంటలు ఆర్పి ఉంటే ఇంత ఘోరమైన ప్రమాదం జరిగి ఉండేది కాదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment