ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి…మంత్రి ఫోన్ చేసి భరోసా.**దుఃఖంతో మాట్లాడుతున్న బాలరాజుకు ధైర్యం చెప్పిన రవాణా శాఖ మంత్రి..**నిందితుడికి కఠిన చర్యలు తప్పవని స్పష్టం..

ఇల్లంతకుంట,నవంబర్ 21 (మన వార్త ప్రతినిధి); రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట–సిరిసిల్ల రహదారిలో వల్లంపట్ల గ్రామం వద్ద రెండు రోజుల క్రితం జరిగిన ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కల్లూరి బాలరాజుపై..ఓ వ్యక్తి “నా కారుకు సైడ్ ఇవ్వలేదంటూ” అమానుషంగా దాడి చేయడంతో ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.సంఘటనకు సంబంధించిన వీడియోలు,ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో “మన తండ్రిలాంటి ఆర్టీసీ డ్రైవర్‌ను ఇలా తన్నడం,కొట్టడం ఏంటి..?” అంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా శుక్రవారం రోజున రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డ్రైవర్ బాలరాజుతో ఫోన్‌లో మాట్లాడి,అతని ఆరోగ్యం గురించి ఆరాధీశారు.సంభాషణలో బాలరాజు దుఃఖంతో మాట్లాడుతూ,“సార్… నాకు ఆర్టీసీలో ఇన్ని సంవత్సరాల సీనియార్టీ ఉంది.ఎన్నో అవార్డులు తెచ్చుకున్నాను.నా తప్పు లేకుండా ఇలా దెబ్బలు తినడం చాలా బాధగా ఉంది” అని చెప్పారు.మంత్రి పొన్నం ప్రభాకర్ బాలరాజుకు ధైర్యం చెప్పి, “నువ్వు భయపడొద్దు… నీకు నేను అండగా ఉంటాను.నిందితుడిపై కఠిన చర్యలు తప్పవు” అని భరోసా ఇచ్చారు.ఈ ఘటనపై రాష్ట్ర ప్రజలు కూడా ఏకగ్రీవంగా స్పందిస్తూ,దాడి చేసిన వ్యక్తికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Comment