ఎల్కతుర్తి,నవంబర్ 8 (మనవార్త ప్రతినిధి ) మార్కెట్‌లో నాటు కోడి మాంసం కావాలంటే మటన్‌తో సమానంగా రేటు చెల్లించాల్సిందే. ఆ కూరకు అంత క్రేజ్ మరి. అయితే, తాజాగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో వింత ఘటన చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే, నిత్యం రద్దీగా ఉండే సిద్ధిపేట–ఎల్కతుర్తి రహదారిపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఎల్కతుర్తి ప్రాంతంలో సుమారు 2 వేలకుపైగా నాటు కోళ్లను రోడ్డుపై వదిలి వెళ్లిపోయారు.ఆ కోళ్లు సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి, ముఖ్యంగా పత్తి పంటల్లోకి చేరాయి. దీంతో గమనించిన రైతులు, గ్రామస్థులు ఆ కోళ్లను ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీశారు. చివరకు అవి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై వదిలి వెళ్లినట్టుగా తేలింది.ఇంకేముంది, గ్రామస్థులు ఆ కోళ్లను ఎంచక్కా పట్టేసి ఇళ్లకు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన తరువాత సమీప గ్రామాల ప్రజలు కూడా నాటు కోళ్ల వేటలో నిమగ్నమై, ఒక్కొక్కరు రెండు–మూడు చొప్పున కోళ్లను పట్టుకుని ఇళ్లకు తీసుకెళ్లారు.తీరా ఇంటికి తీసుకెళ్లిన తరువాత, ఎల్కతుర్తి వెటర్నరీ హాస్పిటల్ డాక్టర్ తెలియజేసిన దాని ప్రకారం — “ఆ కోళ్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఇంకా స్పష్టత లేదు. వాటిని ల్యాబ్‌కి పంపించాము. ఆరోగ్యపరంగా ఏవైనా జబ్బులు వచ్చే అవకాశం ఉన్నందున, ల్యాబ్ రిపోర్ట్ వచ్చే వరకు వాటిని తినరాదు” అని పశు వైద్యశాల డాక్టర్ ప్రజలకు సూచించారు.