అర్హత లేని వారు వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు… జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్ నార్సింగి…

నవంబర్ 6( మన వార్త ప్రతినిధి )ఆర్.ఎమ్.పీ వైద్యులు ల్యాబ్ నిర్వహణ, వార్డులు ఏర్పాటు చేసి చికిత్స ఇవ్వడం, మెడికల్ షాప్ నిర్వహించడం చేయకూడదని, ప్రాథమిక చికిత్స మాత్రమే అందివ్వాలని లేదా చట్ట రీత్యా చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీ రామ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీ రామ్ తన కార్యాలయంలో నార్సింగి మండల విలేకరులతో మాట్లాడుతూ ఆర్.ఎమ్.పీ/ పీ.ఎమ్.పీ లకు అలాగే ప్రజలకు పలు సూచనలు చేశారు. ఆర్.ఎమ్.పీ/ పీ.ఎమ్.పీ లు వైద్యానికి పూర్తి అర్హత కలిగిన వైద్యులు కారని, వారు ప్రాథమిక చికిత్స కేంద్రం పెట్టుకోవాలని, ఆసుపత్రి/ క్లినిక్ పెట్టుకోకూడదని అన్నారు. రోగులకు నాణ్యమైన చికిత్సను అందివ్వాలని, అత్యధిక మోతాదు గల యాంటీబయాటిక్ లను వాడ కూడదని, వాటి వల్ల మూత్రపిండాలు, గుండె, మెదడు దెబ్బతినే ప్రమాదముందని, రోగి బరువును బట్టి మోతాదు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. వారు ప్రాథమిక చికిత్స మాత్రమే అందివ్వాలని, స్వంతంగా యాంటీబయాటిక్ లు ఇచ్చి వైద్యం చేయడం ప్రమాదమని, అనర్ధాలకు దారి తీస్తుందని అన్నారు. రోగులకు దగ్గరలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, లేదా వ్యాధిని బట్టి జిల్లా ఆసుపత్రికి పంపాలని అన్నారు. అర్హత లేని వారు వైద్యం చేస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ (సీ.ఈ.ఏ), ప్రీ కాన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నోసిస్ యాక్ట్ (పీ.సీ.పీ.ఎన్.డీ.టీ) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీ.ఈ.ఏ, పీ.సీ.పీ.ఎన్.డీ.టీ కమిటీ కి కలెక్టర్ చైర్ పెర్సన్ కాగా, జడ్జీ, ఎస్పీ, డీ.ఎమ్.హెచ్.ఓ ఆధీనంలో పని చేస్తుందని తెలిపారు. జిల్లా లో కొందరు అర్హత లేకుండా క్లినిక్, వార్డులు, ల్యాబ్, మెడికల్ షాపులు నిర్వహిస్తూ, అధిక మోతాదులో యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ప్రసవాలు చేయడం, మంచాలు ఏర్పాటు చేసుకుని వైద్యం చేయడం మొదలయిన వైద్యం అందిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అలా వైద్యం నిర్వహిస్తున్న వారి వివరాలను డివిజన్, మండల ప్రకారం సబ్ డివిజనల్ అథారిటీ ద్వారా సేకరించమని, వారికి చట్ట ప్రకారం నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. నోటీసులకు సరైన జవాబు ఇవ్వకపోతే సీజ్ చేయడం తో పాటు వారి పై సంభందిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు మండల, డివిజన్, జిల్లా స్థాయి లో అన్ని రకాల ఆధునిక వసతులతో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, జిల్లా మెడికల్ కళాశాల లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్రజలకు ఉచిత వైద్యం అందివ్వడానికి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయని, దూరం అనిపించినా గాని అక్కడ అత్యున్నత అర్హత అనుభవం కలిగిన వైద్యులు అందుబాటులో ఉంటారని వ్యాధి నిర్ధారణ కోసం సరైన పరీక్షలు జరిపి అవసరమైన మందులు ఉచితంగా అందిస్తారని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. అనర్హులైన వారి వద్ద చికిత్స పొందితే అనర్థాలు సంభవిస్తాయి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉత్తమ చికిత్స పొందాలని, రోగ నిర్ధారణ కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణా డయాగ్నొస్టిక్ సెంటర్ లో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారని ప్రజలు సద్వినియోగ పరుచు కోవాలని కోరారు. ఆర్.ఎమ్.పీ, పీ.ఎమ్.పీ లు ప్రాథమిక చికిత్స మాత్రమే అందివ్వాలని లేదా కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీ రామ్ హెచ్చరించారు.

Leave a Comment