వైన్ షాప్ వచ్చింది…ఉద్యోగం పోయింది..

మహబూబ్‌నగర్ జిల్లా రాంనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీ గా పనిచేస్తున్న పుష్ప పేరుతో ఆమె భర్త ఇటీవల మద్యం టెండర్ వేయగా వారికి *ధర్మపూర్ వైన్‌షాప్* లక్కీ డిప్‌లో దక్కింది. ఇందుకు సంబంధించి పుష్ప అధికారుల సమక్షంలో సంతకం చేసి తదనంతర ప్రక్రియను సైతం పూర్తి చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మద్యం టెండర్లు దక్కించుకోవడానికి అర్హులు కాదని నిబంధనలు ఉండడంతో ఓ వ్యక్తి టెండర్ల ఖరారు రోజునే అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ అంశం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని విచారణ జరిపారు. పీఈటీ పుష్ప మద్యం టెండర్ల దాఖలు నుంచి షాపు దక్కేవరకు చేసిన ప్రక్రియలకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి నివేదించగా పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్‌కుమార్ ఇవాళ *పీఈటీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు* జారీ చేశారు.

Leave a Comment