తూప్రాన్ జూన్ 24 (మన వార్తా ప్రతినిధి, పి. ఆంజనేయులు గౌడ్) తూప్రాన్ మండలం కిష్టాపూర్ హల్ది వాగులో ఈనెల 20న పోలీస్, రెవిన్యూ, విద్యుత్ అధికారులు సంయుక్తంగా దాడి చేసి అక్రమ విద్యుత్ పరికరాలతో పాటు అక్రమంగా డంపు చేసిన ఇసుక కుప్పలను సీజ్ చేశారు. ఇసుక కుప్పలను సోమవారం వేలం వేస్తామని అదే రోజు తహసిల్దార్ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గలవారు మెదక్ కలెక్టర్ పేరిట డీడీలు తీసి తాసిల్దార్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఇసుక వేలం వేద్దామని రెవిన్యూ సిబ్బంది అక్కడికి వెళ్ళగా ఇసుక కుప్పలు మాయం కావడంతో ఒక్కసారి గా కంగుతిన్నారు. చేసేదేమీ లేక ఆర్ ఐ ప్రేమ్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీజ్ చేసిన ఇసుక కుప్పలు మాయం కావడం పట్ల సర్వత్ర చర్చనీయాంశమైంది.