వేములవాడ జూన్ 15 (మన వార్త ప్రతినిధి దెబ్బేటి ప్రవీణ్ )
తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణం పెట్టిన ఉద్యమ కళాకారులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని, వారిని గుర్తించి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని రాష్ట్ర కన్వీనర్ కళాతపస్వి యెల్లపోశెట్టి కోరారు. ఆదివారం కరీంనగర్ కళాభారతిలో జరిగిన “పాటల పల్లకి” కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు విస్తరించిన ఈ కార్యక్రమానికి నేర్నాల కిషోర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉద్యమ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ యెల్లపోశెట్టి, ఉత్తర తెలంగాణ కోఆర్డినేటర్ బొడ్డు రాములు, కార్యక్రమ నిర్వాహకులు చక్రాల రఘు, గోనెల సమ్మయ్య మరియు వివిధ జిల్లాల బాధ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యెల్లపోశెట్టి మాట్లాడుతూ – “తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమ గాయనీ గాయకులు కీలకపాత్ర పోషించారు. గోనె గొంగడి, డప్పు, గజ్జెలతో పాటల పల్లకిని మోసిన వారు ఎండనకా వాననకా రాష్ట్ర సాధన కోసం పోరాడారు. కానీ వారికి తగిన గౌరవం లభించలేదు. గత ప్రభుత్వాలు వారిని నిర్లక్ష్యం చేశాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఉద్యమ కళాకారుల గుర్తింపుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, అర్హులకు ఉద్యోగాలు కల్పించాలని, సాంస్కృతిక సారధి కింద 1000 మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అదేసమయంలో వృద్ధ కళాకారులను రాష్ట్ర సాలకులుగా గుర్తించి వారికీ నెలకు రూ.25,000 గౌరవవేతనం ఇవ్వాలన్నారు. కార్యక్రమం అనంతరం కరీంనగర్ జిల్లా శ్రీ తపాలా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన మహా చండీయాగం ముగింపు కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.