అల్వాల్ సిటిజన్ కాలనీలో హాస్టల్‌లో అగ్నిప్రమాదం.ఏసీలు బ్లాస్ట్…ఊపిరాడక ఆరుగురు విద్యార్థులు అస్వస్థత నాలుగు,అంబులెన్సులు, ఒక ఫైర్ ఇంజన్‌తో సహాయక చర్యలు….

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, జనవరి 25 మన వార్త :అల్వాల్ పరిధిలోని సిటిజన్ కాలనీలో ఉన్న నైన్ ఎడ్యుకేషన్ హాస్టల్‌లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర కలకలం సృష్టించింది. హాస్టల్ నాలుగో అంతస్తులో అమర్చిన ఎయిర్ కండీషనర్లు అకస్మాత్తుగా బ్లాస్ట్ కావడంతో మంటలు చెలరేగి, క్రమంగా ఐదవ అంతస్తుకు వ్యాపించాయి.ఈ ఘటన సమయంలో ఐదవ అంతస్తులోని ఒక గదిలో సుమారు 20 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉన్నారు. మంటల నుంచి వచ్చిన దట్టమైన పొగ బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. ఈ క్రమంలో ఆరుగురు విద్యార్థులు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని గదిలోనే కుప్పకూలిపోయారని సమాచారం.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నాలుగు అంబులెన్సులు, ఒక ఫైర్ ఇంజన్ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా, అస్వస్థతకు గురైన ఆరుగురు విద్యార్థులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.గ్లాస్ బిల్డింగ్ వల్లే ప్రమాదం తీవ్రత?హాస్టల్ భవనం పూర్తిగా గ్లాస్ నిర్మాణంతో ఉండటంతో పొగ బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందని తెలుస్తోంది. వెంటిలేషన్ సరిగా లేకపోవడం వల్లే విద్యార్థులు ఎక్కువగా ఉక్కిరిబిక్కిరి అయ్యారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.120 మందికి పైగా విద్యార్థులుఈ హాస్టల్‌లో బాలురు, బాలికలు కలిపి సుమారు 120 మంది విద్యార్థులు నివసిస్తున్నారని సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో మరింత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉంటే తీవ్ర ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలుఈ ఘటనతో హాస్టళ్లలో ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు, వెంటిలేషన్ సౌకర్యాలపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంబంధిత అధికారులు హాస్టల్ యాజమాన్యంపై విచారణ చేపట్టి, అగ్నిప్రమాదానికి గల కారణాలను నిర్ధారిస్తామని తెలిపారు.విద్యార్థుల భద్రతే ప్రథమ ప్రాధాన్యమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.

Leave a Comment