నోటీసులు జారీ చేసిన గ్రామపంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్…..
ఇల్లంతకుంట మండలం ,ఏప్రిల్ 21 (మనవార్త ప్రతినిధి);ఇల్లంతకుంట మండల కేంద్రానికి వచ్చే ప్రధాన రహదారులపై చికెన్ సెంటర్ యజమానులు మాంస వ్యర్థాలు వేయడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మంగళవారం ఉదయం “మనవార్త” లో ప్రచురితమైన వార్తకు వెంటనే స్పందించిన సర్పంచ్ మామిడి రాజు,గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌తో కలిసి చర్యలు చేపట్టారు.చికెన్,మటన్ సెంటర్ యజమానులతో మాట్లాడి ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు వారికి నోటీసులు జారీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అనంతారం,రహీంఖాన్‌పేట,వంతడుపుల,ఎస్సీ కాలనీ పరిసర ప్రాంతాల్లో రహదారికి ఇరువైపులా మాంస వ్యర్థాలు పడేయడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని తెలిపారు.రహదారిపై వెళ్లే వాహనాలకు అవి ఎదురుగా పడటం,అడ్డంకిగా మారటం వల్ల ప్రమాదాల పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.ఇకపై రహదారి పక్కన మాంస వ్యర్థాలు వేస్తే గ్రామపంచాయతీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాంస వ్యర్థాలను గ్రామానికి దూరంగా ఉన్న నిర్జీవ ప్రదేశాల్లోనే వేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాకం సుమన్,అంతటి శ్రీకాంత్ గౌడ్,చికెన్,మటన్ షాపుల యజమానులు పాల్గొన్నారు.