జనవరి 07 మన వార్త ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో డ్రైనేజీ నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వస్తోందని వారు వాపోతున్నారు. నిలిచిపోయిన మురుగునీటి వల్ల దోమల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, దీనివల్ల డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారని, దోమల నివారణకు ఎటువంటి ఫాగింగ్ చర్యలు చేపట్టడం లేదని వారు విమర్శించారు. మున్సిపల్ అధికారులు, పారిశుధ్య విభాగం వెంటనే స్పందించి, 8వ వార్డులోని మురికి కాలువలను యుద్ధప్రతిపాదికన శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని క్రమం తప్పకుండా పారిశుధ్య పనులు నిర్వహించాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వార్డు నివాసితులు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.