డిసెంబర్ 31 మన వార్త ప్రతినిధినూతన సంవత్సర వేడుకలను సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని ఎల్కతుర్తి స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సంబరాల పేరుతో రోడ్లపై రాకపోకలకు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేడుకలు నిర్వహించాలని పోలీసులు సూచించారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని సూచించారు. రాష్ డ్రైవింగ్, అతివేగం, ట్రిపుల్ రైడింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనలపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.వేడుకల సమయంలో బైక్ రేసులు, స్టంట్స్ చేయడం, రహదారులపై గుంపులుగా తిరగడం నిషేధమని పేర్కొన్నారు. మహిళలు, యువత, విద్యార్థులు భద్రతతో ఇంటికి చేరేలా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని చెప్పారు.అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, సెల్‌ఫోన్ వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపినట్లయితే జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎల్కతుర్తి పోలీసులు విజ్ఞప్తి చేశారు.